21, ఫిబ్రవరి 2018, బుధవారం

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు

అగ్నితత్వ రాశులు :- మేషం, సింహాం, ధనస్సు రాశుల వారు అగ్నితత్వానికి చెందినవారు. వీటికి వరుసగా అధిపతులైన కుజ, సూర్య, గురువు అగ్నితత్వం కలిగి ఉంటారు. అగ్నితత్వ రాశుల వారు ఉష్ణ తత్వం కలిగి కోప స్వభావాలు కలిగిఉంటారు. అగ్నితత్వం కావటం వలన వికాసం, శక్తి సామర్ధ్యాలు, చైతన్యం, ప్రేరణ, సాహసం, పౌరుషం, కోపం మొదలగు లక్షణాలు కలిగి ఉంటారు. న్యాయకత్వం, దైర్యసాహసాలు, శత్రువులపైన విజయాలు.
 
ఆరాటం, పోరాటం కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించుట. ఇతరులను తమ అడుగు జాడలలో నడిపించుట. ఇతరులు పొగిడినచో పొంగిపోయి ఆపదలు కొని తెచ్చుకుందురు. అగ్నితత్వ రాశులలో లగ్నం గాని, రాశిగాని, ఎక్కువ గ్రహాలు గాని ఉన్నప్పుడు అగ్నితత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కువ మంది అధికారులు గాని, నాయకులు గాని, సైన్యాధిపతులు గాని అగ్నితత్వ రాశుల యందు లగ్నం గాని, చంద్రుడు గాని, సూర్యుడు గాని ఉండగా జన్మింతురు. వీటిని దర్మత్రికోణ స్ధానాలు అనికూడా అంటారు.  

మేషరాశి :- ప్రధమ రాశి కావటం వలన ప్రతి పనిలో ముందు ఉండాలని కోరుకుంటారు. ప్రతి పని చేయగలననే ఆత్మ విశ్వాసం, సంకల్ప శక్తి, ఇచ్చా శక్తి కలిగి ఉంటారు. ప్రతి పనిలో చొరవ చూపిస్తారు. ప్రధమ స్ధానం పొందటానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించటానికి ఉత్సాహం చూపిస్తారు. కుజరాశి అయినందున చురుకుదనం, దైర్యం, సాహసం, పౌరుషం, స్వేచ్చ, స్వతంత్ర ప్రవర్తన, నిర్భయంగా మాట్లాడటం, నిస్సంకోచంగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వీరి లక్షణాలు.  

ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, అహంభావం, అహంకారం కలిగి ఇతరులను లెక్క చేయక పోవటం. తల బిరుసుతనం, తొందరపాటు, ముందు వెనుక ఆలోచించకుండా ప్రతి పనిలో చొరవ చూపిస్తారు. రోషం, కోపం ఎక్కువ. తగాదాలకు ముందుంటారు. తనకు తోచిన విధంగా ప్రవర్తించటం. అన్నిరకాల పోటీలకు ముందుంటారు. ఒక ఉద్యమాన్ని, ఒక సంస్ధను నడపగలిగే నాయకత్వ లక్షణాలకు మేషరాశి కారకత్వం వహిస్తుంది.

సింహారాశి:- సింహా రాశి పంచమ రాశి కావటం వలన ఈ రాశి వారికి స్ఫురణ శక్తి, సృజనాత్మక శక్తి కలిగి ఉంటారు. అధికార నిర్వహణా సామర్ధ్యం కలిగి ఉంటారు. వ్యూహాలను రచించటంలో నిపుణత కలిగిఉండటం, నీతి నియమాలు, లౌకిక ఙ్ఞానం, అంచనా వేయగలిగే సామర్ధ్యం, పరిపాలనా సామర్ధ్యం కలిగి ఉంటారు. శత్రువులను తెలివిగా ఎదుర్కొనే సామర్ధ్యం, ధైర్య సాహసాలు, పరాక్రమ వంతులుగా ఉంటారు. గుర్తింపును తెచ్చిపెట్టే క్రీడలు, కళలు, పందాలు, జూదం మొదలగు వాటిపై అభిలాష కలిగిస్తుంది. ఊహాత్మక సామర్ధ్యం కలిగి ఉండటం చేత విద్యా సంస్ధల నిర్వహణ, భోధన రంగాలలో రాణిస్తారు. 

రవి ఆరోగ్య కారకుడు కావటం వలన బాల వైద్యం, ప్రశుతి వైద్యం, హృద్రోగ చికిత్సలలో రాణిస్తారు. విశాల హృదయులు కావటం వలన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపడతారు. రవి రాశి కనుక పెత్తనం కలిగి ఉండాలనుకోవటం, ఇతరులు తనని అనుసరించాలనుకోవటం, తన మాటే నెగ్గాలనుకోవటం,  ప్రతి విషయంలో పర్యవేక్షణ కలిగి ఉండటం, యాజమాన్య లక్షణాలు, అధికార నిర్వహణా సామర్ధ్యం, రాజకీయాలలో రాణింపు, న్యాయకత్వ నిర్వహణ, గౌరవ పదవులకు సింహరాశి ప్రాదాన్యత వహిస్తుంది.

ధనస్సు రాశి :- పంచమానికి బావాత్ భావం కావటం వలన మంచి ఙ్ఞాపక శక్తి, ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు. గురుగ్రహానికి స్వక్షేత్రం కావటం వలన వివిధ శాస్త్రాల అద్యయనం, వివిధ అంశాలపై పరిశోదన, ఉన్నత విధ్యాభ్యాసం, భోదన, వైఙ్ఞానిక సంస్ధల నిర్వహణ, గ్రంధ రచన చేయగలగటం, ప్రచురణ, ప్రసంగించటం, ప్రసార మాద్యమాలను వినియోగించుకోవటం, వైఙ్ఞానికి, శాస్త్రీయ అంశాలపై సలహాలిచ్చే వృత్తుల పట్ల ఆసక్తి కలిగి ఉండటం. 

అర్హతను, అవకాశాలను సక్రమంగా వినియోగించటం. దూరం, వేగం లక్షణాలు కలిగిన ఈ రాశి వారి విదేశీ వ్యవహారాలలో రాణిస్తారు. సమాచార, పర్యాటక, రవాణా రంగాలలో రాణించగల సమర్దతను కల్పిస్తుంది. సత్వర ఫలితాలు పొందాలనే ఆరాటం, ఉత్సాహం కలిగిస్తుంది. వేదశాస్త్రం, న్యాయ శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, తత్వ శాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలగు అద్భుత శాస్త్రాల పట్ల ఆసక్తి కలిగిస్తుంది. ధైవ భక్తి, ధర్మ చింతన, ఆశాభావం, ఉన్నతమై కోరికలు, ఆశయాలు కలిగి ఉండటం ఈ రాశి లక్షణాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...