16, నవంబర్ 2017, గురువారం

అన్నప్రాశన

అన్నప్రాశన


అన్నప్రాశన ఆరో నెల ఆరవ రోజున చేయటం ఆచారం. ఆ రోజు చేసేప్పుడు ముహూర్తం అన్వేషణతో పని లేదు అని ఒక పెద్ద వాదన సంఘంలో ఉంది. అది చాలా తప్పు. ఆరవ నెల ఆరవ రోజు, అమావాస్య కానీ, మంగళవారం కానీ గ్రహణం కానీ వస్తే అన్నప్రాశన చేస్తామా? కేవలం మూఢమి పట్టింపు లేదు అన్నారు కానీ ముహూర్త పట్టింపు లేదు అనే వాదన చాలా దోష వాదన.

అన్నప్రాశన ముహూర్త ప్రభావం పిల్లవాడి జీవిత ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి.


మగ పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలు నిండిన తర్వాత గానీ, సంవత్సరం నిండిన తర్వాత గానీ శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు అన్నప్రాసనము చేయవలెనని ఋషులచే చెప్పబడినది.(ముహూర్త దర్పణం).

‘షష్ఠేష్టమేవా దశమే చ మాసి సంవత్సరేవా దివసే ప్రవృద్దే’ శిశువు జననం మొదలుగా ఆరు, ఎనిమిది, పది, పన్నెండు మాసాలలో మంచి రోజులు అన్నప్రాశన చేయమని చెప్పారు.

ఆడ పిల్లకు "స్త్రీణాంతు పంచమాది విషమే మాసే పంచమ సప్తమ నవమైకాదశేషు విషమేషు శుభదం” అని కాలామృతం నందు వున్నది. స్త్రీలకు బేసి మాసములో అనగా ఐదు,ఏడు,తొమ్మిది మాసములలో అన్నప్రాసన చేయవలెను.

వృషభ,కర్కాటక,మిధున,కన్య,దనస్సు,మీనములనెడి,శుభలగ్నమందు,పాడ్యమి,చవితి,షష్థి,అష్టమి,నవమి,ఏకాదశి,ద్వాదశి,అమావాస్య,పున్నమి ఈ దినములు నిషేదించి మిగిలిన తిధులయందు అన్నప్రాశన మంచిది.పునర్వసు, మృగశిర, ధనిష్ఠ, పుష్యమి, హస్త, స్వాతి, అశ్వినీ, అనురాధ, శ్రవణం, శతభిషం, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, చిత్త నక్షత్రములు వున్న సమయంలో ‘వారాశ్శుభాశ్చ గురు చంద్ర సితేందు జానాం’ శుభ గ్రహ వారములయిన సోమ, బుధ, గురు, శుక్ర వారములు, తప్పనిసరి అయితే శని ఆదివారములలో చెయ్యవచ్చు.

‘దశమే శుద్ధి సంయుక్తే శుభ లగ్నే శుభాంశనే’ లగ్నాత్ దశమ స్థానం శుద్ధి, అష్టమ స్థానం శుద్ధి చూడాలి .శుద్ది అంటే దశమంలో,అష్టమంలో గ్రహాలు లేకుండుట.కొంతమంది దశమం,అష్టమంలో పాపగ్రహలు ఉండరాదు.శుభగ్రహాలు ఉండచ్చు అని అంటారు. . లగ్నాత్ నవమంలో బుధుడు, అష్టమంలో కుజుడు సప్తమంలో శుక్రుడు లేకుండా ముహూర్తం చూడమన్నారు .

అన్నప్రాశ లగ్నంలో రవి ఉన్న యెడల కుష్ఠు రోగి గాను,క్షీణ చంద్రుడు ఉన్న దరిద్రుడి గాను,పూర్ణ చంద్రుడు ఉన్న అన్నదాత గాను,కుజుడున్న పైత్యా రోగి గాను,బుద్ధుడున్న విశేష జ్ఞాన వంతుడిగాను,గురువున్న భోగ మంతుడుగాను,శుక్రుడున్న దీర్ఘాయువు గలవాడు గాను,శని ఉన్న వాత రోగము కల వాడు గాను,రాహు కేతువులు ఉన్న దరిద్రుడు అగును అని కాలామృత గ్రంధం నందు వివరించబడినది.

ముహూర్త సమయానికి వున్న లగ్నానికి పాపగ్రహ సంబంధం లేకుండా చూసి ముహూర్తం చేయమని, అన్నప్రాశన చేయమని జ్యోతిశ్శాస్తవ్రేత్తలు అందరూ చెబుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...